మనిషికి మాత్రమే వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఇలా జరగడానికి కొన్ని యుగాలు పట్టింది. సృష్టిలో దాగిఉన్న అద్భుతాలను, రహస్యాలను మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు ఈ వెన్నుపూస ఎంతో దోహద పడుతుంది. శివరాత్రి రోజు ఆ దివ్యమైన శక్తి మన శరీరంలో చేరడానికి ప్రకృతి సహకరిస్తుంది. అందుకనే శివరాత్రి ఎంతో ముఖ్యమైన రాత్రి. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది, కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రమే మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివుని రాత్రి. పూర్వం ఆ మహాశివుడు తనలోని ఉనికిని ఆపి స్థిరత్వంలోకి చేరుకున్న రాత్రే ఈ మహాశివరాత్రి. అమావాస్య ముందు రాత్రి అత్యంతమైన చీకటి రాత్రి. శివ అంటే శూన్యం అని అర్థం. శూన్యం నుంచి ఈ సృష్టి అవతరించింది. ఆ మహా శివుని లీలకి ప్రతీకగా మహాశివరాత్రి జరుపుకుంటాం. అంతే కాకుండా చాలా మంది ఈ రాత్రి శివుని కళ్యాణం జరిగిన రాత్రి గా భావించి ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని జరుపుతారు.